Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 19, 2013

హోషేయ1వఅధ్యాయము

1  ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారు డైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. 
2  మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెనుజనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. 
3  కాబట్టి అతడుపోయి దిబ్లయీము కుమార్తెయైన గోమె రును పెండ్లిచేసికొనెను. ఆమె గర్భవతియై అతనికొక కుమారుని కనగా 
4  యెహోవా అతనితో ఈలాగు సెల విచ్చెనుఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము. యెజ్రె యేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయేలువారికి రాజ్యముండకుండ తీసి వేతును. 
5  ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. 
6  పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగాదీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రా యేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను. 
7  అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును. 
8  లోరూ హామా (జాలినొందనిది) పాలువిడిచిన తరువాత తల్లి గర్బ éవతియై కుమారుని కనినప్పుడు 
9  యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగామీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై యుండను గనుక లోఅమీ్మ (నాజనము కాదని) యితనికి పేరు పెట్టుము. 
10  ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందుమీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననేమీరు జీవముగల దేవుని కుమారులైయున్నా రని వారితో చెప్పుదురు. 

11  యూదావారును ఇశ్రాయేలువారును ఏకముగా కూడుకొని, తమ పైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములోనుండి బయలుదేరుదురు; ఆ యెజ్రెయేలు దినము మహా ప్రభా వముగల దినముగానుండును. 

హోషేయ2వఅధ్యాయము

1  మీరు నా జనులని మీ సహోదరులతోను జాలి నొందినవారని మీ స్వదేశీయులతోను మీరు చెప్పుడి. 
2  నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగాచేసి, పాడు పెట్టి యెండిపోయిన భూమి వలెను ఉంచి, దప్పిచేత లయపరచకుండునట్లు, 
3  మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను; 
4  దాని పిల్లలు జారసంతతియై యున్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసియున్నది, వారిని కన్నది అవమానకర మైన వ్యాపారము చేయునది గనుక వారియందు నేను జాలిపడను. 
5  అదినాకు అన్నపానములను గొఱ్ఱ బొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. 
6  ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును. 
7  అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అదిఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదు ననుకొనును. 
8  దానికి ధాన్య ద్రాక్షారసతైలము లను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే యని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉప యోగపరచెను. 
9  కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొఱ్ఱబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండ నేను ఉంచుకొందును; 
10  దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును. 
11  దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామకకాలములను మాన్పింతును. 
12  ఇవి నా విటకాండ్రు నాకిచ్చినజీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును, అడవిజంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును. 
13  అది నన్ను మరచిపోయి నగలుపెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపమువేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడియుండుటనుబట్టియు నేను దానిని శిక్షింతును; ఇది యెహోవా వాక్కు. 
14  పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును; 
15  అక్కడనుండి దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లనిత్తును; ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణద్వారముగా చేసెదను, బాల్యమున ఐగుప్తు దేశములోనుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు 
16  అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవుబయలు అని నన్ను పిలువకనా పురుషుడవు2 అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. 
17  అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొన కుండను అవి దాని నోట రాకుండను నేను చేసెదను. 
18  ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువుల తోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశ ములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివ సింపజేయుదును. 
19  నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతినిబట్టి తీర్పుతీర్చుటవలనను, దయాదాక్షిణ్యములు చూపుటవలనను నిన్ను ప్రధానము చేసికొందును. 
20  నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును. 
21  ఆ దినమున నేను మనవి ఆలకింతును; ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమియొక్క మనవి ఆలకించును; 
22  భూమి ధాన్య ద్రాక్షారసతైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు3 చేయు మనవి ఆలకించును. 
23  నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితోమీరే నా జనమని నేను చెప్పగా వారునీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు. 

హోషేయ3వఅధ్యాయము

1  మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగాఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించి నట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. 
2  కాగా నేను పదునైదు తులముల వెండియు ఏదుము యవలును తీసి కొని దానినికొని ఆమెతో ఇట్లంటిని 
3  చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను; నీయెడల నేనును ఆలాగున నుందును. 
4  నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలదినములు రాజు లేకయు అధిపతిలేకయు బలినర్పిం పకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు. 
5  తరు వాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచా రణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. 

హోషేయ4వఅధ్యాయము

1  ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆల కించుడి. సత్యమును కనికరమును దేవునిగూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు. 
2  అబద్ధసాక్ష్యము పలు కుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగి లించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు. 
3  కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులును ఆకాశ పక్షులును కాపురస్థులందరును క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడ గతించిపోవుచున్నవి. 
4  ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము లేదు; ఒకని గద్దించినను కార్యము కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు. 
5  కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతోకూడ ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనముచేతును. 
6  నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. 
7  తమకు కలిమి కలిగినకొలది వారు నాయెడల అధికపాపము చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును. 
8  నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు. 
9  కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును ఆలాగే సంభవించును; వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేతును. 
10  వారు యెహోవాను లక్ష్య పెట్టుటమానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు. 
11  వ్యభిచారక్రియలు చేయుటచేతను ద్రాక్షారసము పానముచేయుటచేతను మద్యపానము చేతను వారు మతిచెడిరి. 
12  నా జనులు తాము పెట్టు కొనిన కఱ్ఱయొద్ద విచారణచేయుదురు, తమ చేతికఱ్ఱ వారికి సంగతి తెలియజేయును, వ్యభిచారమనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచ రింతురు. 
13  పర్వతముల శిఖరములమీద బలులనర్పింతురు, కొండలమీద ధూపము వేయుదురు, సింధూరవృక్షముల క్రిందను చినారువృక్షముల క్రిందను మస్తకివృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు; అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారిణులైరి. 
14  జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యముచేయుచు బలుల నర్పింతురు గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటనుబట్టి నేను వారిని శిక్షింపను, మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను; వివేచనలేని జనము నిర్మూల మగును. 
15  ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా ఆ పాపములో పాలుపొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు; బేతావెనునకు పోవద్దు; యెహోవా జీవముతోడని ప్రమాణముచేయవద్దు. 
16  పెయ్య మొండి తనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱ పిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును. 
17  ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము. 
18  వారికి ద్రాక్షారసము చేదా యెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారముచేయు వారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకర మైన దానిని ప్రేమింతురు. 
19  సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొనిపోవును; తాము అర్పించిన బలులనుబట్టి వారు సిగ్గునొందుదురు. 

హోషేయ5వఅధ్యాయము

1  యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలు వారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివార లారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరి గాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. 
2  వారు మితి లేకుండ తిరుగు బాటుచేసిరి గనుక నేను వారినందరిని శిక్షింతును. 
3  ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలువారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలువారు అపవిత్రులైరి. 
4  తమ క్రియలచేత అభ్యంతరపరచబడినవారై వారు తమ దేవునియొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుటవలన వారు యెహోవాను ఎరుగక యుందురు. 
5  ఇశ్రాయేలుయొక్క అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలువారును ఎఫ్రాయిమువారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లు చున్నారు; వారితోకూడ యూదావారును తొట్రిల్లు చున్నారు. 
6  వారు గొఱ్ఱలను ఎడ్లను తీసికొని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసికొనినందున వారికి కనబడకుండును. 
7  యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి; ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడ లయమగుదురు. 
8  గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊదుడి; బెన్యామీనీయులారామీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి. 
9  శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును; నిశ్చయముగా జరుగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపువారికి నేను తెలియజేయుచున్నాను. 
10  యుదావారి అధిపతులు సరి హద్దు రాళ్లను తీసివేయువారివలెనున్నారు; నీళ్లు ప్రవ హించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును. 
11  ఎఫ్రాయిమీయులు మానవపద్ధతినిబట్టి ప్రవర్తింప గోరు వారు; వారికధికశ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురు బాధింపబడుదురు. 
12  ఎఫ్రాయిమీయు లకు చిమ్మట పురుగువలెను యూదావారికి వత్సపురుగు వలెను నేనుందును. 
13  తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయులయొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. 
14  ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహమువంటివాడను గాను యూదావారికి కొదమ సింహమువంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేక పోవును 
15  వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకువరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును; తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. 

హోషేయ6వఅధ్యాయము

1  మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును 
2  రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. 
3  యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును. 
4  ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవు నట్లును మీ భక్తి నిలువకపోవును. 
5  కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నానోటిమాటల చేత వారిని వధించి యున్నాను. 
6  నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. 
7  ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయెడల విశ్వాస ఘాతకులై నా నిబంధ నను మీరియున్నారు. 
8  గిలాదు పాపాత్ముల పట్టణ మాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కన బడుచున్నవి. 
9  బందిపోటుదొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై యున్నారు, 
10  ఇశ్రాయేలువారిలో ఘోరమైన సంగతి యొకటి నాకు కనబడెను, ఎఫ్రాయిమీయులు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచు కొనెదరు. 
11  చెరలోనికి వెళ్లిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యూదా, అతడు నీకు కోత కాలము నిర్ణయించును. 

హోషేయ7వఅధ్యాయము

1  నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందురు. 
2  తమ క్రియల చేత వారు చిక్కుపడి యున్నను అవి నా సముఖముననే జరిగిననుమన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసికొనడని తమలో తాము అనుకొందురు. 
3  వారు చేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు. 
4  రొట్టెలు కాల్చు వాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగువరకు పొయ్యిని అధికముగా వేడిమిచేసి ఊరకుండునట్లు వారం దరు మానని కామాతురతగలవారై యున్నారు. 
5  మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలముచేత మత్తిల్లి జబ్బుపడిరి; రాజు తానే అపహాసకులకు చెలికా డాయెను. 
6  పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయ ములను మాటులోనికి తెచ్చుకొని యున్నారు; తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రియంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంటమండి కాలుచున్నది. 
7  పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులంద రును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు. 
8  ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను. 
9  అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. 
10  ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు. 
11  ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు. 
12  వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. 
13  వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్ద ములు చెప్పుదురు 
14  హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయు దురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు. 
15  నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్‌యోచనలు చేయుదురు. 
16  వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.